Site icon NTV Telugu

Nadendla Meets Kanna: కన్నా ఇంటికి నాదెండ్ల మనోహర్‌.. విషయం అదేనా..?

Nadendla Meets Kanna

Nadendla Meets Kanna

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అప్పుడే హీట్‌ పెంచుతున్నాయి.. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలతో మాటల యుద్ధమే నడుస్తోంది.. మరోవైపు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కీలక నేత, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటకి వెళ్లారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. దీంతో, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అనే చర్చ మొదలైంది.. గుంటూరులోని కన్నా నివాసానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్‌.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. అయితే, కన్నతోనే ఎందుకు సమావేశం అయ్యారు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్న మాట ఎంత వాస్తవమో.. ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్‌ ఉన్నది కూడా అంతే నిజం అని చెబుతుంటారు. పొత్తుల వ్యవహారంలో మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో చర్చిస్తారు.. కానీ, కన్నా ఇంటికి ఎందుకు వెళ్లారు? దీంట్లో ఇంకా ఏదైనా మతలాబు ఉందా? అనే చర్చ సాగుతోంది.

Read Also: Paytm LPG Offers: శుభవార్త.. ఇలా చేస్తే గ్యాస్‌ బుకింగ్‌పై రూ.1000 క్యాష్‌ బ్యాక్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది.. గతంలో సోము వీర్రాజును టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు కన్నా.. వాటిపై స్పందించడానికి కూడా సోమువీర్రాజు ప్రయత్నం చేయలేదు.. ఈ నేపథ్యంలో.. నాదెండ్ల మనోహర్‌.. కన్నా ఇంటికి వెళ్లడం చర్చగా మారింది.. బీజేపీ వ్యవహారాలు చర్చించాలంటే.. సోము వీర్రాజుతో కదా.. కన్నా ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తే మాత్రం.. ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్‌.. అయితే, ఎవరిని కలిసినా.. ఏం జరిగినా.. ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు.. మరోవైపు, కన్నా లక్ష్మీనారాయణ.. జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వదంతులు కూడా వ్యాపించాయి.. సోము వీర్రాజుతో విభేదాల కారణంగా కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్న కన్నా.. జనసేన వైపు చూస్తున్నారా? అనే చర్చ మొదలైంది.. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దిండచమే తమ లక్ష్యం అంటూనే.. మిగతా విషయాలను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో చర్చిస్తానని మనోహర్‌ వ్యాఖ్యానించారంటే.. కన్నా ఏవైనా ప్రతిపాదనలు పెట్టారా? వాటిపై పార్టీ అధినేతతో చర్చించి.. కన్నాకు నాదెండ్ల మనోహర్‌ క్లారిటీ ఇవ్వనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరనున్నారనే వార్తలను ఆయన అనుచరులు కొట్టిపారేస్తున్నారు.. నాదెండ్ల మనోహర్ గుంటూరు పర్యటనకు వచ్చారని.. గుంటూరులో కీలక నేత అయిన కన్నా లక్ష్మీనారాయణను కలిసేందుకు వచ్చారని, దీనిలో ప్రత్యేకత ఏమీ లేదంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు.. ఏదైనా జరగే అవకాశం ఉంటుంది.. మరి.. కన్నా ఎపిసోడ్‌ ఎటువైపు వెళ్తుందో చూడాలి.

Exit mobile version