Site icon NTV Telugu

Janasena: కాపుల ఓట్ల కోసమే.. ఆ హత్యను వైసీపీ తెరపైకి తెచ్చింది

Janasena Kapu Leaders

Janasena Kapu Leaders

Janasena Kapu Leaders Meeting: వైసీపీ కాపు నేతల సమావేశం అనంతరం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు మీటింగ్ పెట్టడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపట్ల అనవసరంగా వ్యాఖ్యలు చేసే వారికే పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారని వివరణ ఇచ్చారు. కాపుల ఓట్ల కోసమే రంగా హత్యను వైసీపీ తిరిగి తెరమీదకి తీసుకొచ్చిందని.. ఆ హత్యపై వైసీపీ నేతలు ఏవేవో అసత్యాలు చెప్తున్నారని విమర్శించారు. కాపుల ఐక్యతను చాటి చెప్పేందుకు.. రానున్న కాలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రంగా లాంటి నేత మళ్లీ తమకు దక్కడని, ఇప్పుడు తమకున్న ఒకే ఒక్క నమ్మకం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తమ సభలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేసుకున్నామని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారని, అన్ని కులాలకు సమన్యాయం చేయాలని ఆయన పాటు పడుతున్నారని జనసేన కాపు నేతలు పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు మాత్రం కేవలం రాజకీయాల కోసం వంగవీటి మోహన్ రంగా పేరుని వాడుకుంటున్నారని, ఆయన కుమారుడ్ని వైసీపీ కార్యకర్తలు అవమాన పరుస్తున్నారని చెప్పారు. తిరుపతిలో 45% కాపులుంటే, ఒక సామాజిక వర్గానికి వైసీపీ పెద్ద పెద్ద పదవుల్ని కట్టబెట్టిందని ఫైర్ అయ్యారు. వైసీపీ వాళ్లకు కాపు ఓట్లు కావాలే తప్ప, రాజ్యాధికారం ఇవ్వడం లేదని, తమ చెప్పుచేతల్లో కాపుల్ని పెట్టుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇక పవన్, చంద్రబాబు కలయిక గురించి మాట్లాడుతూ.. కేవలం సంఘీభావం తెలిపేందుకు పవన్‌ని చంద్రబాబు కలిశారన్నారు. సీట్ల సర్దుబాటు గురించి వాళ్లిద్దరి మధ్య చర్చలే జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కలుస్తారోనన్న భయంతో.. వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Exit mobile version