Pawan Kalyan: జనసేన నేత పోతిన వెంకట మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిన మహేష్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని.. రాష్ట్రంలో పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని పవన్ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని.. జెండా దిమ్మలు పగుల కొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టరని పోలీసులను పవన్ ప్రశ్నించారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందని ఎద్దేవా చేశారు.
జగ్గయ్యపేటలోనూ జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను వైసీపీ నేతలు జేసీబీతో కూల్చేశారని.. దీనిపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమో పోలీస్ అధికారులు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. జనసేన శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని అనుమతి లేదన్న సాకుతో పోలీసులు అడ్డుకుంటున్నారని.. ఇది పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నామన్నారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని పవన్ నిలదీశారు.
Read Also: APTF: ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఏపీటీఎఫ్
వైసీపీ నేతలు వాడవాడల్లో పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మలు, వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్, పంచాయితీల అనుమతి తీసుకుంటున్నారా అని పవన్ ప్రశ్నించారు. అన్నింటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలరా అన్నారు. అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా అని అడిగారు. పోలీసులు ధర్మాన్ని పాటించాలని.. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదన్నారు. ప్రజలే పార్టీని కాపాడుకుంటారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని పెద్దలు, ఈ శాసనసభ్యులు ఈరోజు ఉంటారని.. రేపు పదవి ఊడితే ఇంటికి పోతారు. కానీ పోలీసులు మాత్రం సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారన్నారు. మరో పార్టీ, ప్రభుత్వం వస్తే మీరు తలదించుకునే పరిస్థితి రాకూడని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. \
అడ్డుకుంటే… రోడ్డెక్కుతాం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/46hDNzRjDP
— JanaSena Party (@JanaSenaParty) September 3, 2022
