Site icon NTV Telugu

Pawan Kalyan: సీఎం కాన్వాయ్ కోసం వాహనాల స్వాధీనం ఏంటి?.. పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌

Pawan Kalyan

Pawan Kalyan

సీఎం వైఎస్‌ జగన్‌ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్‌ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందన్నారు.. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి.. రూ.7.77 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని.. అలాంటిది సీఎం పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏమిటి? అని మండిపడ్డారు.

Read Also: YSR Sunna Vaddi: రేపు ఒంగోలుకు సీఎం జగన్.. సున్నావడ్డీ పథకం ప్రారంభం..

ఇక, సీఎం భద్రత పర్యవేక్షించే అధికారులు.. కాన్వాయ్‌లో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా..? అని ప్రశ్నించారు.. అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకొంటున్నారో వివరించాలని నిలదీశారు పవన్‌ కల్యాణ్… లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉందా..? అని ప్రశ్నించారు… ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగున పెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందన్నారు.. ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణికులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడి వారిపై ఎందుకుంది..? ఈ పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలన్నారు. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తెచ్చారా? ఉన్నతాధికారులు తెచ్చారా..? అనేది ముఖ్యమన్న పవన్.. పాలనా వ్యవస్థలో భాగమైన ఆ ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో, ఎవరి వినియోగం కోసం బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారో వెల్లడికావాలన్నారు.. ఏటా సీఎం భద్రతకు ఎంత ఖర్చు చేస్తున్నారు? కాన్వాయ్‌లో ఉండే వాహనాలు ఎన్ని? సీఎం పర్యటనలకు ప్రైవేట్ వాహనాలు ఎందుకు స్వాధీనం చేసుకొంటున్నారు? అనే అంశాలపై వివరణ ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒంగోలు ఘటనపై శాఖపరమైన విచారణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌. కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ కోసమంటూ.. ఒంగోలులో ఇన్నోవా కారును బలవంతంగా తీసుకెళ్లారు.. దీంతో, వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.. ఇక, దీనిపై స్పందించిన సీఎంవో.. ఉన్నతాధికారులు ఆర్టీఏ సిబ్బంది ఇద్దరిపై సస్పెన్షన్​వేటు వేసిన విషయం తెలిసిందే.

Exit mobile version