ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు.
బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు. బాలినేనిని బుజ్జగించటానికి వచ్చిన సజ్జల.. కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండి తిరుగు పయనం అవడం చర్చకు దారితీస్తోంది. ఇదిలా వుంటే.. బాలినేని నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను సజ్జల ను కలవటానికే ఇక్కడికి వచ్చాను. నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాను. నేను సీనియర్‌ను. నాకు మంత్రి పదవి రావాల్సిందేనన్నారు.మరో వైపు లోపలికి ఎవరినీ అనుమతించక పోవడంతో నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మంత్రి ఏం నిర్ణయం తీసుకున్నా పాటిస్తాం అంటున్నారు మరికొందరు నేతలు. బాలినేని నివాసం దగ్గర కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోతోంది. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని నినాదాలు చేశారు కార్యకర్తలు.
నాకు ఇంకా ఫోన్ కాల్ రాలేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి వర్గంలో 10 మంది పాత వారికి 15 మంది కొత్త వారికి అవకాశం వుంటుందన్నారు. నాకు పదవి వచ్చినా….రాకపోయినా సీఎం జగన్ ఆదేశాలు మేరకు పనిచేస్తాను. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్ళారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
మరోవైపు మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం విజయవాడ బయలు దేరారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకి కార్యకర్తలు ఆల్ దిబెస్ట్ చెప్పడం కనిపించింది. ఆయన ఉత్సాహంగా కార్యకర్తలతో సెల్ఫీలు దిగడం విశేషం.
Dharmana Prasada rao
మంత్రి పదవికి సంబంధించి తమకు ఇంకా ఫోన్ రాలేదని అంటున్నారు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు,దాడిశెట్టి రాజా. అధిష్ఠానం నుండి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యేలు. ఫోన్ వస్తే బయలుదేరి వెళతాం అంటున్నారు.
