NTV Telugu Site icon

EAPCET-2023: ఈఏపీ సెట్‌లో మళ్లీ ఇంటర్‌ వెయిటేజీ..

Students

Students

EAPCET-2023: కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.. మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. విద్య ఆన్‌లైన్‌కే పరిమితమైంది.. పరీక్షలు కూడా లేకుండా పై తరగతులకు ప్రమోట్‌ చేశారు.. ఇక, గతంలో ఉన్న మార్కుల వెయిటేజీ సైతం ఎత్తివేసింది ప్రభుత్వం.. కానీ, ఇప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మళ్లీ వెయిటేజీ తప్పనిసరి చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, అగ్రి­కల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌–2023లో ఇంటర్మీడియెట్‌ మార్కు­లకు వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు.. ఇంటర్‌ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను కేటాయించనున్నారు.. అయితే, కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన ఇంటర్‌ మార్కుల వెయిటేజీ.. మళ్లీ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. విద్యార్థులు కొత్త టెన్షన్‌ మొదలైంది..

Read Also: Rangareddy crime: హైదరాబాద్ లో మిస్సింగ్ కలకలం..

అంటే, ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేయడానికి ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.. సెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరిస్తారు.. లేట్‌ ఫీతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. ఇక, మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను నిర్వహించనున్నారు.. కాగా, కోవిడ్‌కు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలు జరగని కారణంగా ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్.. ఈఏపీసెట్‌లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయిస్తూ వచ్చింది.. కానీ, ప్రస్తుతం ఇంటర్‌ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని పునరుద్ధరించారు..