కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో దర్శనానికి ఆంక్షలు విధిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. స్వామి, అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం ఉందన్నారు. స్పర్శదర్శనం, అంతరాలయ దర్శనాలు, గర్భాలయ అభిషేకాలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. గతంలో టికెట్లు పొందినవారికి గర్భాలయ అభిషేకాలు పునః ప్రారంభం తరువాత అవకాశం కల్పిస్తామన్నారు.
Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు
అటు ఆలయంలో తీర్థం, ఉచిత ప్రసాద వితరణ, వేదాశీర్వచనం కూడా నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. గంటకు కేవలం 1000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఆర్జిత సేవలలో ప్రస్తుతం జారీ చేస్తున్న టికెట్లలో సగం మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆర్జితసేవా టికెట్లు, శీఘ్ర, అతి శీఘ్రదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో వ్యాక్సినేషన్ ధృవీకరణ వివరాలను నమోదు చేయాలన్నారు. అటు ఆలయంలో నిత్యాన్నదానం కార్యక్రమంతో పాటు పాతాళగంగలో పుణ్యస్నానాలు, రోప్ వే, బోటింగ్‌ను నిలిపివేసినట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు.