NTV Telugu Site icon

KA Paul: మేం అధికారంలోకి వస్తే మహిళను సీఎం చేస్తాం..!

Ka Paul

Ka Paul

మేం అధికారంలోకి వస్తే ఓ మహిళను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో హడావిడి చేసిన ఆయన.. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకున్నారు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ తరచుగా పర్యటిస్తున్నారు.. వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. అధికార, ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.. గురువారం అనంతపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు.. డబ్బులు లేక సీఎం వైఎస్‌ జగన్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఒక్క అవకాశంతో జగన్‌కి ప్రజలు అధికారమిచ్చారని.. అప్పులు దొరక్క జగన్ పాలన సరిగా చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు.. ఈసారి జగన్‌కు ఓట్లు పడే అవకాశం లేదని జోస్యం చెప్పిన ఆయన.. రౌడీయిజం, గుండాయిజం చెల్లుబాటు కావని మండిపడ్డారు.. ఇక, బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేదన్న పాల్.. పవన్ కల్యాణ్ పులిలాంటి తనతో కలిసి రావాలని కోరారు.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి కాలేదు.. కానీ, మేం అధికారంలోకి వస్తే.. మహిళను సీఎం చేస్తామని.. లక్ష కోట్ల రూపాయలు తెస్తానని ప్రకటించారు.

Read Also: Mamata Benerjee: దిల్లీ పర్యటనలో బెంగాల్ సీఎం.. నేడు ప్రధానితో భేటీ

కాగా, ఈ మధ్యే రాయలసీమ నేతలపై ఘాటు కామెంట్లు చేశారు పాల్.. రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులని ఆరోపించారు. గతంలో రాష్ట్రానికి సీఎంగా చేసిన వారంతా రాయలసీమ వాసులేనని గుర్తు చేసిన ఆయన.. మొత్తానికి రాయలసీమను రాక్షససీమగా రాజకీయ నాయకులు మార్చారని మండిపడ్డారు.. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసి, వైఎస్ఆర్, వైఎస్ జగన్.. కడప జిల్లా వాళ్లు అని పేర్కొన్న విషయం తెలిసిందే.. అంతేకాదు.. కమ్మ వాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారని కేఏ పాల్ తెలిపారు.. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన.. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతారని వ్యాఖ్యానించారు.. ఇక, చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే.