NTV Telugu Site icon

ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్‌ చేసిన మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌

ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా సర్దుమనగడం లేదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్‌ విధానంలో పొందాలని జీవో 142ను జారీ చేసింది. అంతేకాకుండా టికెట్ల ధరలపై కూడా జీవో 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సవాల్‌ చేస్తూ ఇప్పటికే సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి సీఎం జగన్‌తో సమావేశమై సినిమా టికెట్ల ధరలపై చర్చించారు.

త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన వెల్లడించారు. అయితే తాజాగా ఏపీ హైకోర్టుని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆశ్రయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 142ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సినిమా టికెట్లు ఆన్లైన్‌లో ప్రభుత్వ విక్రయాలు చేసేలా జీవో ఉందని, ప్రభుత్వ జీవో నిబంధనలకు విరుద్దమని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకి వాయిదా వేసింది.