Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు ఊరట లభించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్తకు రెండు రోజుల కిందట నాంపల్లి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కొత్తపల్లి గీతను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 16వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: Virat Kohli: అప్పుడు నేను తొండి ఆట ఆడాను.. అవుటైనా బ్యాటింగ్ చేశాను..!!
కాగా కొత్తపల్లి గీత, రామకోటేశ్వరరావు డైరెక్టర్లుగా ఉన్న విశ్వేశ్వర ఇన్‌ఫ్రా కంపెనీ 2008లో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42 కోట్ల రుణం పొందారు. అయితే తప్పుడు పత్రాలు సమర్పించడంతో పాటు కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారని అభియోగం నమోదైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 2015లో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. సదరు రుణం ద్వారా పొందిన డబ్బును సొంత అవసరాలకు మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు కొత్తపల్లి గీత దంపతులకు జైలుశిక్ష విధించింది.
