Site icon NTV Telugu

Vasireddy Padma Resign to YSRCP: వైసీపీకి మరో షాక్‌.. పార్టీకి కీలక నేత గుడ్‌బై..?

Vasireddy Padma

Vasireddy Padma

Vasireddy Padma Resign to YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజారిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు.. ఇలా పార్టీని వీడారు.. అంతేకాదు.. మరికొంతమంది చూపు.. టీడీపీ, జనసేన, బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, ఈ తరుణంలో మరో కీలక నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ.. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట సీటు ఆశించారు వాసిరెడ్డి పద్మ.. అయితే, ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం.. ఇక, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది..

Read Also: Cyclone Dana: దానా తుఫాన్ ప్రభావం.. ఏపీ సహా మరో మూడు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్

కాగా, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో.. మనస్థాపానికి గురైన వాసిరెడ్డి పద్మ.. ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.. పార్టీలో యాక్టివ్‌గా పనిచేసేందుకు తాను రాజీనామా చేశానని ప్రకటించిన ఆమె.. ఆ ఎపిసోడ్‌ తర్వాత వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా కనిపించడంలేదు. ఇక, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలోతో పాటు.. అంతకుముందు వైసీపీ తరపున తన గొంతును వినిపిస్తూ వచ్చిన వాసిరెడ్డి పద్మ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా.. ఏ ఇష్యూపైనా పెద్దగా స్పందించింది లేదు.. ప్రస్తుతం ఏపీలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా.. ఇప్పుడు వైసీపీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారట.. అయితే, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజారాజ్యం పార్టీలో ప్రారంభించిన వాసిరెడ్డి పద్మ.. ఆ పార్టీ అధికారప్రతినిధిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం.. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో.. వైసీపీలో చేరారు.. ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు.. ఎన్నికల ముంగిట ఆ పదవికి రాజీనామా చేసిన ఆమె.. ఇప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. మరి వాసిరెడ్డి పద్మ అడుగులు ఏ పార్టీ వైపు పడతాయో చూడాలి..

Exit mobile version