Site icon NTV Telugu

CID Notices to RGV: వ‌ద‌ల బొమ్మాళి..! మరో కేసులో ఆర్జీవీకి సీఐడీ నోటీసులు..

Rgv

Rgv

CID Notices to RGV: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మను కేసులు వదలడం లేదు.. ఓ కేసులో ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జీవీని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.. అయితే, ఇదే సమయంలో.. మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది వర్మ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు ఆర్జీవీ.. అయితే, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశాడంటూ గత ఏడాది నవంబర్ 29వ తేదీన సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేవారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.. ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసు ఇచ్చారు సీఐడీ సీఐ తిరుమలరావు. మరి, ఈ కేసులో విచారణకు ఆర్జీవీ హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది..

Read Also: RGV Police Interrogation: ముగిసిన ఆర్జీవీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం..!

కాగా, పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా.. విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన ఆర్జీవీ.. హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్‌ సంపాదించారు.. అయితే, విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుగుణంగా.. ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.. రాంగోపాల్ వర్మపై దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసు అధికారులు.. సీఐ శ్రీకాంత్‌ నేతృత్వంలోని పోలీసుల టీమ్‌ ఆర్జీవీని విచారించింది.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌తో పాటు నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ (ట్విట్టర్‌)లోని తన ఖాతాలో పోస్ట్‌ చేశారు ఆర్జీవీ.. అయితే, తన ఎక్స్ లో నుండే పోస్టింగ్స్ చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారట ఆర్జీవీ.. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ పోస్టింగ్స్ చేసినట్టు తెలిపారట.. కానీ, ఆ పోస్టింగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధం లేదని ఆర్జీవీ సమాధానం ఇచ్చారట.. మరోవైపు ఫైబర్ నెట్ నుండి రెండు కోట్ల రూపాయలు… వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపై కూడా ఆర్జీవీని ప్రశ్నించారు పోలీసులు..

Exit mobile version