Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది.. రూల్స్ ప్రకారం అంబటి రాంబాబుకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది గుంటూరు కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది కోర్టు.. అయితే, ఇంటి నుంచి భోజనం, మంచం, బెడ్డు, దిండు, దోమతెర, ఎయిర్ కూలర్, అవసరమైన మందులు, మెడికల్ పర్యవేక్షణ, ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు అంబటి రాంబాబు.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. అంబటి రాంబాబు మాజీ మంత్రి కాబట్టి అతనికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది.. అంబటి రాంబాబుని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా చూడాలని అధికారులను ఆదేశించింది గుంటూరు కోర్టు..
Read Also: X (Twitter) DOWN.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు..!
మరోవైపు.. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు, పోలీస్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 18వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసు 2023 సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించినది. ఈ వ్యవహారంపై గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కోర్టులో ఇరు పక్షాల మధ్య ఆసక్తికర వాదనలు సాగాయి.. అంబటి రాంబాబు తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వాదనల్లో.. తీవ్ర నేరాలు, జీవితఖైదు శిక్షలు పడే కేసుల్లోనే బెయిల్ నిరాకరించాలి.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ అవసరం లేదని.. రెండేళ్లలోపు శిక్ష విధించే సెక్షన్లు మాత్రమే ఉన్నందున కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు.. అంబటికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.. మరోవైపు, పోలీసుల తరఫు న్యాయవాది.. అంబటి రాంబాబు లాటరీ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని వాదించారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ కోసం పోలీస్ కస్టడీ అవసరమని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బెయిల్ మరియు పోలీస్ కస్టడీ పిటిషన్లపై తీర్పును ఈ నెల 18వ తేదీకి రిజర్వ్ చేశారు. ఈ కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.