Ambati Rambabu : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమం గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసు రత్నం పాల్గొన్నారు. రైతుల సమస్యలపై వారు తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. “నిన్నటి వరకు ఎరువుల కొరత లేదని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు 50 వేల టన్నుల యూరియా కావాలని కేంద్రాన్ని ఎలా కోరుతున్నాడు? రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది” అని మండిపడ్డారు. వైసీపీ 40 శాతం ఓటింగ్‌తో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Gen Z Protests: నేపాల్‌లో ఉద్రిక్తంగా జెన్-జెడ్ ఉద్యమం.. ఎవరీ సుడాన్ గురుంగ్?
అలాగే, తనపై పోలీసులు రాత్రి వేళ అక్రమ చర్యలకు దిగారని అంబటి రాంబాబు ఆరోపించారు. “అర్ధరాత్రి వేళ రెండు కార్లలో పోలీసులు నా ఇంటికి వచ్చారు. మా వత్తిడి వలనే సుగాలీ ప్రీతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. తురకపాలెం ఘటనలో వైసీపీ గళం ఎత్తిన తరువాతే కూటమి ప్రభుత్వం మేలుకొంది” అని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు ఇవ్వాల్సిన సమయంలో నోటీసులు ఇస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా మీద అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇప్పటికైనా రైతులను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం” అని హెచ్చరించారు.
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పొలాలు వదిలి రోడ్లపైకి రావాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. “వైసీపీ రైతుల కోసం పోరాడుతుంటే, పోలీసులు ఉగ్రవాదుల్లా మమ్మల్ని చుట్టుముట్టారు. గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సకాలంలో అందించాం. కానీ కూటమి పాలనలో రైతులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు” అని ఆరోపించారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూటమి పార్టీలు ఎంజాయ్ చేయడానికి కాకుండా సేవ చేయడానికి ఉపయోగించుకోవాలని మోదుగుల వేణుగోపాలరెడ్డి సూచించారు. “రైతుల అవసరాలను పట్టించుకోని ప్రభుత్వం అధికారంలో ఉండటానికి అర్హతలేదు. అవసరమైన ప్రతి రైతుకు ఎరువులు అందించాలి” అని డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యలపై వైసీపీ పోరాటానికి మరింత ఊపును తెచ్చింది. రైతుల సమస్యలను విస్మరించే కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.
Maharashtra: మహిళా న్యాయమూర్తి క్వార్టర్స్ లో కూలిన స్లాబ్.. ఇంజనీర్లపై క్రిమినల్ కేసు నమోదు…
