YSRCP: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి ఏకంగా జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. డొక్కా గో బ్యాక్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ నినాదాలు చేశారు. కానీ రెండు రోజుల్లో నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. నిన్నటివరకూ డొక్కాకు అదనపు సమన్వయకర్త పదవి రద్దు చెయ్యాలని అధిష్టానాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పుడు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత డొక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత తాడికొండ అడ్డరోడ్డువద్ద సమావేశమవుతున్న ఎమ్మెల్యే వర్గీయులను కలిశారు. మళ్లీ ఎందుకు సమావేశమంటూ వారితో నేరుగా మాట్లాడడంతో అక్కడ నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మేము మీకు వ్యతిరేకం కాదంటూ సమాధానమిచ్చారు. అంతటితో ఆగని డొక్కా మొదటిసారిగా తుళ్లూరు మండలం వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లారు. వెంకన్నను దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వర్గీయులు మినహా మిగతా వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Read Also: AP Cabinet Meeting: ఈనెల 29న ఏపీ కేబినెట్ సమావేశం.. ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఉత్తర్వులు
ఈ నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మొదటి పర్యటన తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు డైలమాలో పడ్డారు. నిన్నటివరకూ ఎమ్మెల్యే ఉండగా సమన్వయకర్తను ఎలా నియమిస్తారంటూ మాట్లాడిన ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పుడు కొత్తరాగం అందుకున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటించారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత నియోజకవర్గానికి వస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే తాము కూడా పాల్గొనేవారమంటున్నారు. పార్టీలో గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకుపోవాలని కోరుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవికి విలువ తగ్గకుండా చూడాలని కూడా కోరుతున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా కలిసి నేతలందరిని సమన్వయం చేస్తే ఇబ్బంది తొలగిపోతుందంటున్నారు. మొత్తానికి డొక్కా తొలి పర్యటన ద్వారా ఎమ్మెల్యే వర్గీయులు డిఫెన్స్‌లో పడేలా చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కలిసి మాట్లాడుకోవాలని నేతలు కోరుతున్నారు. ఇప్పటికే తాను ఎమ్మెల్యేను కలుస్తానని డొక్కా చెప్పారు. ఇద్దరూ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తే అంతా సర్దుకుంటుందని వైసీపీ అభిమానులు కోరుతున్నారు.
