Site icon NTV Telugu

Goranta Buchaiah Chowdary: ఏపీలో నవరత్నాలకు రంధ్రాలు పడ్డాయి

Gorantla Buchaiah Chowdary

Gorantla Buchaiah Chowdary

ఏపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ పాకుడు మెట్ల మీద ఉన్నారని.. ప్రతిరోజూ ఆయన కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అని ప్రజలే నినాదాలిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు టూర్ మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిందని.. ఏపీ ప్రభుత్వం ఛార్జీలతో విపరీతంగా బాదేస్తుందని ప్రజలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఓ చేత్తో డబ్బులు ఇచ్చి.. మరో చేత్తో రెండింతలు జగన్ ప్రభుత్వం లాక్కుంటోందని మండిపడ్డారు. జగన్ హయాంలో ఐదు లక్షలు పెన్షన్లు, 12 లక్షలు రేషన్ కార్డులు రద్దయ్యాయని వివరించారు.

ఏపీలో నవరత్నాలకు రంధ్రాలు పడ్డాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. అమ్మఒడి కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సారా బుడ్డికే పోతున్నాయని ఆరోపించారు. గతంలో అందరికీ ఫీజు రీయింబర్సుమెంట్ అందించే వాళ్లమని.. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పేరుతో నిబంధనలు పెట్టారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలతో ప్రజలు విసిగిపోయారని గోరంట్ల పేర్కొన్నారు.

ఆస్పత్రుల్లో వసతుల కోసం వైసీపీ నేతలు చందాలు అడుగుతున్నారని.. ఫ్యాన్లు కావాలన్నా.. సీలింగ్ వేయాలన్నా చందాలు తీసుకురావాలని సూచిస్తున్నారని మండిపడ్డారు. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయని.. అంబులెన్స్ మాఫియాకు అధికార పార్టీ అండదండలున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు కూడా లేని దుస్థితి నెలకొందన్నారు. డబ్ల్యూహెచ్‌వో చెప్పిన దాని ప్రకారం ఏపీ ప్రభుత్వం కూడా భారీ ఎత్తున కరోనా మరణాలను దాచేసిందని విమర్శలు చేశారు. కరోనా వల్ల మరణించిన బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహరం కూడా ఇవ్వలేదన్నారు. అనుమతులే రాని వైద్య కళాశాలలను కట్టేశానని సీఎం జగన్ స్వయంగా బోగస్ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ ఓ బోగస్ సీఎం అని.. వైసీపీది ఓ ఫ్రాడ్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. APMSIDC అనేది బ్రోకరేజ్ సంస్థగా మారిందన్నారు. ప్రభుత్వమే తక్షణమే మేల్కొని ఆస్పత్రుల్లో మందులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోని కాంట్రాక్టర్లకు సంబంధించి సుమారు రూ. లక్ష కోట్లు పెండింగులో ఉన్నాయని.. ఆరోగ్యశ్రీకి చెద పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కాలంలో పనులు పూర్తి చేస్తే.. వాటికి సీఎం జగన్ రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు.

Ambati Rambabu: జనసేనకు దశ, దిశ లేదు.. బాబు ఇక సీఎం కాలేడు..!

Exit mobile version