Site icon NTV Telugu

Gidugu Rudra Raju: దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయే..

Gidugu Rudra Raju

Gidugu Rudra Raju

దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదవి కన్నా పీసీసీని బాధ్యతగా స్వీకరిస్తాను అన్నారు.. టీమ్ వర్క్ తో ముందుకు వెళ్తాను.. ఈ దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం తామేనని స్పష్టం చేశారు.. త్వరలోనే బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర పర్యటన చేస్తామని ప్రకటించారు. ఇక, అగ్ర వర్ణాలవారికే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారంటూ హర్షకుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం.. క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధిష్టానానికి హర్ష కుమార్‌ లేఖ రాసిన విషయం విదితమే కాగా.. హర్షకుమార్ అసంతృప్తి పై స్పందించిన గిడుగు.. ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ అనేక అవకాశాలని ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, హర్ష కుమార్‌ను కలిసి ఆయనతో కలిసే పార్టీని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు.

Read Also: CPI Kunamneni: కమ్యూనిస్టు పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు?

ఇక, భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు గిడుగు రుద్రరాజు.. మరోవైపు, ఘర్ వాపసీ కింద అనేక మంది కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రానున్నారని.. ఇప్పటికే మాతో కొంత మంది టచ్‌లో వున్నారని తెలిపారు.. ఏఐసీసీ నిర్ణయం మేరకు త్వరలో ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు గిడుగు రుద్రరాజు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలకమార్పులు చేసింది అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజుని నియమించింది అధిష్టానం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి. రాకేశ్ రెడ్డిని.. ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంఎం పళ్లంరాజును.. క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌ను నియమించారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ-మెయిల్ ద్వారా తిరస్కరణ లేఖను పంపిన విషయం విదితమే.

Exit mobile version