NTV Telugu Site icon

కుప్పంలో ఉద్రిక్తత…మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్ట్ !

కుప్పం వేదికగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా జరిగిన గొడవతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలు ప్రచారం చేయకుండా అధికార పార్టీ కుట్రలు చేస్తోందంటూ.. డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. కుప్పంలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టీడీపీ అధ్యక్షుడు నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగిన ఘటనలో 19 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కొంత మందిని అరెస్ట్ చేయగా, తాజాగా కుప్పంలోని ఓ హోటల్లో బస చేసిన అమర్నాథ్ రెడ్డి, నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ పోరులో నామినేషన్లు విత్ డ్రా సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, తుది జాబితా ప్రకటించలేదని టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.

అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తం కుప్పం మున్సిపాలిటీ బరిలో టీడీపీ 126నామినేషన్లు, వైసీపీ 89 ,కాంగ్రెసు పార్టీ 15, బిజెపి తరపున ఐదుగురు నామినేషన్లు వేసారు. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, రాత్రి తొమ్మిది వరకు తుది జాబితా ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. దీనిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేశారు. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టుని చంద్రబాబు తప్పుబట్టారు. దీనిపై డీజీపీకి లేఖ రాశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. నేతల అరెస్టులతో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని, దీనికి పోలీసులు సహకరిస్తున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. తప్పుచేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.