Site icon NTV Telugu

ఆస్పత్రిలో మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ.. ఈరోజే సీఐడీ డెడ్‌లైన్..!

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, నోటీసు వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. 13వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు… అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లక్ష్మీ నారాయణ.. అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.. ఈ నెల 10వ తేదీన సీఐడీ తనిఖీల సందర్భంగా ఇంట్లో స్పృహ తప్పి పడిపోయాడు.. అధిక రక్తపోటుతో హాస్పిటల్‌కు తరలించారు.. ఈ రోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన సీఐడీ పోలీసులు.. ఇక, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారని చెబుతున్నారు.. ఆయన ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన తర్వాతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందంటున్నారు.. వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తే ఆయన మంగళగిరిలోని సీఐడీ ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉంది.

కాగా, చంద్రబాబు సర్కార్‌లో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన లక్ష్మీనారాయణ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సేవలందించారు. అయితే.. లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే అధికారులు సోదాలు చేసింది.. నిధులు దుర్వినియోగం చేశారని.. ఆంధ్రప్రదేశ్‌ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి 241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. సీఐడీ అధికారులు.. లక్ష్మీనారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్​లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సోదాలు చేశారు. మరోవైపు సీఐడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఇంట్లోని పనిమనుషులు ఆరోపించారు. సోదాల్లో భాగంగా హార్డ్‌ డిస్కు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు సోదాలు చేస్తుండగా మరికొందరు లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఉద్వేగానికి గురై ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. మరి లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏం చెబుతారు..? ఆయన సీఐడీ విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version