ఏపీ అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. వారిని సభ నుంచి బయటకు తీసుకువెళ్లాలని మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో మార్చి 22 వరకు మళ్లీ సస్పెండ్ అయిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టలేరు.
కాగా ఈ సస్పెన్షన్‌పై శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. మిగతా వైసీపీ సభ్యులు మద్దతు తెలిపారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లలేదు. అక్కడే తమ నిరసనను కొనసాగించారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు.
