విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెవర శ్రీను అలియాస్ పిల్ల శ్రీను, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్ల బాలస్వామి అలియాస్ పండు, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని బానవతు శ్రీను నాయక్, అజిత్ సింగ్ నగర్ పరిధిలోని మల్లవరపు విజయ్ కుమార్ అలియాస్ మసలం, అజిత్ సింగ్ నగర్ పరిధిలోని కట్ల కాళి అనే రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఐదుగురు రౌడీషీటర్లు నగరంలో అల్లర్లకు పాల్పడి సమాజంలో అలజడి సృష్టిస్తున్నట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. నేర ప్రవృత్తిని మార్చుకోకపోవడం వల్ల నగర బహిష్కరణ విధిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇద్దరితో కలిపి మొత్తం ఏడుగురు రౌడీషీటర్‌లను నగర బహిష్కరణ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా విజయవాడ నగరంలో ఉన్న రౌడీషీటర్లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.
కాగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరకుండా పోలీస్ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన ఆకాష్ హత్యతో పాటు నున్న, పాయకాపురంలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు కొత్త పంథాలో సోషల్ మీడియా వేదికగా చేసుకుని యువతను రెచ్చగొడుతూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఐదేళ్లుగా నేర చరిత్ర హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, అఘాయిత్యాలు, భూకబ్జాలు, సెటిల్ మెంట్‌లు, ఈవ్‌టీజింగ్‌లు వంటి నేరాలకు పాల్పడిన వారి వివరాలను స్టేషన్‌ల వారీగా సేకరించారు.