Vijayawada: దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. టపాసుల దుకాణాలతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి తిరుపతిలో, ఆదివారం ఉదయం విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి మందులు విక్రయించే స్టాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న మరో రెండు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో మూడు షాపుల్లో దీపావళి టపాసులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.
Read Also: Mp Santhosh Kumar: కెమెరాలో బంధించిన పక్షిఫోటో.. వీక్లీడేస్ ను ఎంజాయ్ అంటూ పోస్ట్
అగ్ని ప్రమాదంతో భయంతో వ్యాపారులు , ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనా స్థలానికి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. కాగా భారీ అగ్నిప్రమాదం కారణంగా జింఖానా గ్రౌండ్స్ పరిసర ప్రజలు కాసేపు ఉక్కిరి బిక్కిరి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనం అయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను కాశీ, బ్రహ్మంగా గుర్తించారు. మృతులిద్దరూ బాణసంచా దుకాణంలో పనిచేసే వ్యక్తులు అని పోలీసులు తెలిపారు.
