పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వికేంద్రీకరణలో భాగంగా పల్నాడు కొత్త జిల్లాగా ఏర్పడింది. జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నరసరావుపేట నియోజకవర్గంలోని ఐదు గ్రామాల రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎక్స్ ప్రెస్ హైవే తో తమ తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళనకు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వాడరేవు నకరికల్లు ఎక్స్ ప్రెస్ హైవే తో ఒక్క నరసరావుపేట నియోజకవర్గంలోని ఐదు గ్రామాల రైతులు వందల ఎకరాల భూమిని కోల్పోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు… రోడ్డు విస్తరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు…
860 కోట్ల రూపాయలతో వాడరేవు -నకరికల్లు ఎక్స్ ప్రెస్ హైవే ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలను మమ్మురం చేసింది కేంద్ర ప్రభుత్వం…. వాడరేవు నుండి చిలకలూరిపేట వరకు 430 కోట్లతో రెండు లైన్ల రహదారులు… చిలకలూరిపేట నుండి కేసానుపల్లి, జొన్నలగడ్డ , నరసరావుపేట, ఇస్సా పాలెం గుంట గార్లపాడు రావిపాడు మీదగా నకరికల్లు వరకు 450 కోట్లతో నాలుగు లైన్ల రోడ్లను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది …ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భూమి ఇతర అంశాలను సర్వే చేసిన నేషనల్ హైవే అథారిటీ జొన్నలగడ్డ ,నరసరావుపేట రావిపాడు మీదుగా నకరికల్లు వరకు నాలుగు లైన్ల రోడ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
Read Also: Dil Raju: సిగ్గు, నీతి, మానం లేనిదే సినిమా.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న వందల మంది రైతులు ఎక్స్ ప్రెస్ హైవే ను వ్యతిరేకిస్తున్నారు…. ఇప్పటికే రోడ్లకు, ఇళ్ల నిర్మాణం కోసం మా గ్రామాల్లో వందల ఎకరాల భూమి తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో మా భూములు కావాలని అడగటం న్యాయం కాదని రైతులు అంటున్నారు…. ఈ ప్రాంతాల్లో ఎక్కువ భాగం సన్న చిన్న కారు రైతాంగం ఉన్నారని వారసత్వంగా వచ్చిన భూములను పంట పండించుకోవడమే తమకు తెలుసునని ఇలాంటి భూములు లాగేసుకొని చేతిలో డబ్బులు పెడతామంటే సహించేది లేదని రైతాంగం అంటున్నారు.
ఈ ప్రాంతాల్లో ఇప్పుడు జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి రోడ్డు మీద ఉన్న పొలాలు ఒక్కో ఎకరా మూడు నుండి నాలుగు కోట్లు పలుకుతుంది, అయితే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మాత్రం ఎకరాకు 40 లక్షల లోపే ఉంటుంది… అంటే మార్కెట్ రేటులో కేవలం 10 శాతం మాత్రమే రైతులకు నష్టపరిహారంగా వస్తుంది …ఈ నేపథ్యంలో ఎక్స్ ప్రెస్ హైవే భూముల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని రీ సర్వే చేయించాలని నరసరావుపేట నియోజకవర్గం లోని ఐదు గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు అందరికీ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించమని చెప్పామని, అయితే రాజకీయ కారణాలతో, స్వలాభాల కోసం ,ఈ ఐదు గ్రామాల రైతులకు ఇబ్బంది కలిగేలా ఎక్స్ప్రెస్ హైవే ను నిర్మాణం చేయాలని చూస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Read Also: Andhra Pradesh: రేపు తాడేపల్లిలో బీసీ మంత్రులు, నేతల కీలక సమావేశం
కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఎక్స్ ప్రెస్ హైవే తో మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుందని, బాపట్ల ,పల్నాడు ప్రాంతాలను కలిపేందుకు ఈ ఎక్స్ ప్రెస్ హైవే ఒక వరoలా మారనుందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇప్పటికే టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎక్స్ ప్రెస్ హైవేని రీసర్వే చేసే పరిస్థితి ఉండదని , నేషనల్ అథారిటీస్ హైవే నిర్మాణాల కోసం సర్వే చేసి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ఖరారు చేసిందని ఎమ్మెల్యే అంటున్నారు… అయితే ఈహైవే నిర్మాణం వల్ల తన నియోజకవర్గంలోని కొద్ది మంది రైతులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు. ప్రభుత్వ రేట్ల తో సంబంధం లేకుండా నష్టపోతున్న రైతులకు కొంతమేర నష్టాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి రైతులకు ఎక్కువ శాతం లాభం కలిగేలా ప్రయత్నం చేస్తానని జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే అంటున్నారు.
(గుంటూరు ప్రతినిధి కృష్ణ నాదెండ్ల సౌజన్యంతో)
