NTV Telugu Site icon

Cyclone Effect: రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అకాల వర్షాలు

Formers

Formers

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఏపీలోని రైతులు, కౌలు రైతుల పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతన్నను అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. అసని తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దైన ధ్యానం, పంట చేతికి వచ్చిన తరుణంలో నేలనంటిన వరి చేలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో వరి ధాన్యం తడిచి ముద్దగా మారిపోతోంది. అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన వరి చేలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల్లో  వర్షాభావంతో ధాన్యం బస్తాలు తడిసిపోయిన పరిస్థితి నెలకొంది. ఎకరాకు 25 వేల నుండి 40 వేల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, పంటలు బాగా పండిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టం ఏర్పడుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం పడిపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పినా.. నేటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినా.. ధాన్యం రేటు మాత్రం పెరగడం లేదంటున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొని గిట్టుబాటు ధర కల్పించాలని.. కోతలు దగ్గర పడుతున్న సమయంలో పంట చేజారిపోయిందని రైతులను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని.. ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Asani Cyclone: అలర్ట్.. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు