NTV Telugu Site icon

Andhra Pradesh: ప్రభుత్వ ప్రకటనతో ఆందోళన పడుతున్న రైతాంగం

Ap Farmers Min

Ap Farmers Min

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు త్వరలోనే మీటర్లు ఏర్పాటుచేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 డిసెంబరు నుండి రైతుల బోర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావటంతో భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని రైతాంగంలో చర్చ మొదలైంది. మీటర్ల ఏర్పాటుకు అంగీకార పత్రాలపై రైతులు సంతకాలు చేయకుంటే ఉన్న కనెక్షన్లు తొలగిస్తామని పలు చోట్ల విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసి సంతకాలు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలోని ఏడు డివిజన్ల పరిధిలో 1,92,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,56,052 మంది రైతుల వద్ద నుండి మీటర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ అధికారులు అంగీకార పత్రాలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా మరో 25 వేల మంది రైతుల వద్ద నుండి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉంది.. వచ్చే 30 ఏళ్ల పాటు రైతులకు విద్యుత్ రాయితీ ఇస్తామని ప్రకటించినప్పటికీ నగదు బదిలీ పథకం అమలులో దీనిని రద్దు చేస్తారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 3 హార్స్‌ పవర్ గల మోటార్లకు 2,500 నుంచి 3,500 వరకు బిల్లు వస్తుంది. ప్రభుత్వం ఇంత మొత్తంలో నగదును నేరుగా తమ ఖాతాలకు జమచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు శ్రీకాకుళం తరువాత ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ ప్రక్రియకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పటికే కనిగిరి డివిజన్‌ సీఎస్‌పురం పరిధిలో 300, ఒంగోలు డివిజన్‌ కొత్తపట్నం పరిధిలో 103 మీటర్లు పైలట్‌ ప్రాజెక్టు కింద అమర్చారు. విద్యుత్ మీటర్ల నిర్ణయంతో రైతులు మరింత నష్టపోతామని పలువురు రైతులు భావిస్తున్నారు. రైతులు వినియోగించే ఉచిత వ్యవసాయ విద్యుత్‌పై ఎలాంటి పరిమితి ఉండదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. వారి ఖాతాలోకి నేరుగా ప్రతి నెల నగదును ప్రభుత్వం జమ చేస్తుందని.. దానిని వారు విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందంటున్నారు.

అయితే భవిష్యత్తులో విద్యుత్ వినియోగంపై పరిమితి విధిస్తే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వం నగదు బదిలీ జమ చేయడం ఆలస్యమై సరఫరాను అధికారులు నిలిపేస్తే తమ పంటల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మార్చిలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల ప్రయోగాత్మకంగా వ్యవసాయ మోటార్లకు 103 స్మార్ట్‌ మీటర్లు అమర్చారు. ఇంతవరకు స్తంభాల నుంచి ఈ మీటర్లకు సంబంధించి అనుసంధానం చేయక పోవటంతో పాత పద్ధతే అమలవుతోంది. బోర్లకు మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత రీడింగ్‌ ఎక్కువ తిరిగినా.. రైతు ఖాతాల్లో నగదు జమ కాకపోయినా.. అది మీరే చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేస్తే తమ పరిస్దితేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్లలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి వెంటనే పరిష్కరించకపోతే బకాయిల పేరిట ఆర్థిక భారం పెరిగిపోతుందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Asani Cyclone: దిశ మార్చుకున్న ‘అసని’.. ఏపీకి తప్పనున్న ముప్పు