NTV Telugu Site icon

Congress: కిరణ్‌కుమార్‌రెడ్డి రీ ఎంట్రీ షురూ.. సోనియాకు నివేదిక

Kirna Kumar Reddy 1

Kirna Kumar Reddy 1

విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. జాతీయ స్థాయి పార్టీని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలలోకి తట్టాబుట్టా సర్దేశారు. ఎట్టకేలకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిలుపు అందింది. దీంతో 8 ఏళ్ల తర్వాత ఆయన సోనియా గాంధీతో సమావేశమయ్యారు. 2014లో జరిగిన ఏపీ విభజన తర్వాత సోనియా గాంధీని తొలిసారిగా కిరణ్‌కుమార్‌రెడ్డి కలుసుకున్నారు.

Bangalore Rain: తడిసి ముద్దయిన బెంగళూరు..ఒక్కరోజే 10 సెంటీమీటర్ల వాన

ఏడాది క్రితం మాత్రం రాహుల్ గాంధీతో సమావేశమై కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీలో పార్టీ బలోపేతంపై మంతనాలు జరిపారు. అదే సందర్భంలో సోనియా గాంధీతో భేటీ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సమయంలో సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో భేటీ సాధ్యం కాలేదు. గత ఏడాది ఒకసారి ఫోన్‌లో కిరణ్ కుమార్ రెడ్డితో సోనియా ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో బలోపేతం చేసేందుకు తనకున్న ఆలోచనలను నివేదిక రూపంలో సోనియా గాంధీకి కిరణ్‌కుమార్‌రెడ్డి అందజేశారు. ఈ నివేదికను సమర్పించడంతో పాటు త్వరలో పార్టీలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తానని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీసీసీ బాధ్యతలు తీసుకోవాలని గతంలో పార్టీ అధిష్టానం కోరినప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అయితే ఆయనకు ఇచ్చే బాధ్యతలపై త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి రానుంది. కాగా పార్టీ వ‌ల్ల ప‌దవి, అధికారం, ప్రయోజ‌నాలు పొందిన వారు పార్టీకి తిరిగి సేవ‌లు చేయాల్సిన అవ‌స‌రం వచ్చింద‌ని ఇటీవల ఏఐసీసీ సెక్రట‌రీ మ‌య్యప్పన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.