పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం సన్నద్ధం అయ్యారు. తన రథాన్ని రెడీ చేయించారు. మిలటరీ ట్రక్ తరహాలో ఓ వాహనాన్ని రెడీ చేయించుకుంటున్నారని ముందుగానే వార్తలు వచ్చాయి. అవి నిజమని తేలింది. వారాహి వాహనం ఫోటోలను నిన్ననే పవన్ షేర్ చేసారు. ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో మాత్రం పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఈ రథానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. యుద్దానికి వారాహి సిద్దం అనే టైటిల్ లో వీడియో వదిలారు. కావాలని తన బాడీ గార్డ్ లను మిలటరీ జవాన్లు మాదిరిగా చూపించడం విశేషం.
Pawan Kalyan: ఎన్నికల ప్రచార యుద్ధానికి పవన్ వాహనం సిద్ధం
మిలటరీ ట్రక్, దానికి ఇరు వైపులా సైనికుల మాదిరిగా గార్డులు కవాతు చేస్తున్నట్లు ఓ వీడియో తయారు చేసి వదిలారు. జనసేన సైనికులు ఈవీడియో తయారుకోసం ఎంతగా శ్రమపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పైగా మిలటరీ కలరింగ్ రావడానికి ఇవి మాత్రం సరిపోవు అని సెక్యూరిటీ గార్డ్ లకు పంజాబీల మాదిరిగా గెటప్ లు వేయడం గమనించవచ్చు. సినిమాల్లో లాగే పవన్ కు గబ్బర్ సింగ్ తరహాలో అనేక ఫాంటసీలు వున్నాయి. తుపాకులు. మిలటరీ. నక్సల్ యూనిఫారమ్..ఇలా చాలా ఫాంటసీలు వున్నాయి. రాబోయే ఎన్నికలు మాత్రం మామూలుగా వుండవనే సంకేతం ఈ వాహనం ద్వారా తెలియచేశారు పవన్. ఈ వాహనంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం మీద పేర్ని నాని కౌంటర్ వేశారు. యుద్ధం చేయటానికి వ్యాన్లు కావాలా? ఎన్నికల్లో అలా యుద్ధాలు చేస్తారా?? అలా అయితే నేను కూడా వ్యాను కొని ఉండేవాడిని అన్నారు. ఈ వీడియో చూసి సినిమా టీజర్ అనుకున్నా అన్నారు నాని. డబ్బులు ఉండి వ్యాన్లు కొంటే అయిపోతుంది. ఇవన్నీ సినిమాల్లో పనికి వస్తాయి. బయటే కాదు లోపల ఏముందో కూడా చూపిస్తే బాగుంటుంది అన్నారు. లక్ష పుస్తకాలు చదివాను అంటాడు కదా. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా పవన్ చదివితే బాగుంటుంది. ఈ చట్టం ప్రకారం ఆలీవ్ గ్రీన్ కలర్ సొంత వాహనాలకు వేయకూడదని చెబుతోంది. ఆలీవ్ గ్రీన్ రంగు ఉంటే వాహనం రిజిస్ట్రేషన్ కూడా అవదు. వేరే రంగు వేసే బదులు ముందే వాహనానికి పసుపు రంగు వేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది కదా అన్నారు పేర్ని నాని.
Read Also: TRS Turns BRS: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. సీఈసీ ఆమోదం