Site icon NTV Telugu

Vehicles Scam: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్.. రూ.22.10 కోట్ల ఆస్తులు అటాచ్

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

Vehicles Scam: బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగిన కేసులో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డికి చెందిన రూ.22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో కొత్త వాహనాలను కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. రూ.38.36 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఈడీ తన ప్రకటనలో తెలిపింది.

Read Also: Andhra Pradesh: ఎన్నికల విధుల నుంచి టీచర్లు అవుట్.. మరి ఎవరు నిర్వహిస్తారు?

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌లు జరిగాయని ఈడీ వెల్లడించింది. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలతో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులను నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా తనపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈడీ అధికారులు కేవలం 31 లారీల విషయంలో ప్రశ్నించారని.. రూ.వేల కోట్ల కుంభకోణం అనేది దుష్ప్రచారమే అని స్పష్టం చేశారు. తాను ఎలాంటి మనీ లాండరింగ్‌కు పాల్పడలేదన్నారు. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Read Also: CM Jagan: జనంతోనే మాకు పొత్తు.. దుష్టచతుష్టయం దుష్ప్రచారాలు చేస్తోంది

Exit mobile version