Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…

Scam In Ap

Scam In Ap

ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం పరిధిలోని మక్కినవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. సొసైటీలో నిర్వహించిన ఎరువుల అమ్మకాల్లో ఏకంగా రూ.1.60 కోట్లకు పైగా నిధులు దారిమళ్లినట్లు వెల్లడవడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల్లో సొసైటీ నిధులు గోల్‌మాల్ కావడంపై దిగ్భ్రాంతి చెందిన రైతులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కార్యాలయం ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ విచారణ ప్రక్రియ సాగుతున్న తీరుపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం సొసైటీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న ఒక చిన్న ఉద్యోగిని మాత్రమే బాధ్యుడిగా చూపుతూ, అసలు అక్రమార్కులు, సూత్రధారులు తప్పించుకునేందుకు పక్కా ప్రణాళికతో కుట్రలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ నిధుల దుర్వినియోగం , అవినీతిలో నేరుగా పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందితోనే తిరిగి విచారణ జరిపిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవినీతిపరులే అధికారుల స్థానంలో ఉండి విచారణ జరిపితే బాధ్యులకు శిక్ష పడదని, రైతులకు న్యాయం జరగదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. సహకార శాఖ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని, ఈ రూ.1.60 కోట్ల స్కామ్‌పై నిష్పాక్షికమైన విచారణ జరిపించాలని కోరారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి, నిధుల గోల్‌మాల్‌కు కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని, రైతుల సొమ్మును రికవరీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.