ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా ఒంగోలు వేదికగా ప్రకటించారు. మూడేళ్లలో జగన్ అక్రమార్జన రూ.1.75 లక్షల కోట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఒక్క మద్యం నుంచే జగన్ ఏటా రూ.5వేల కోట్లు దోచుకుంటున్నారని చంద్రబాబు లెక్కలు చెప్పారు. మధ్యంతర ఎన్నికలు వస్తే… ఈ శనిని ముందే వదిలించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి శాశ్వత సమాధి తథ్యమని తేల్చి చెప్పారు. జగన్ విధ్వంసానికి అంతా నాశనమైపోతోంది. రైతుల్లోనూ ఆనందం లేదు. ఎన్టీఆర్ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు తీసేస్తే… జగన్ మళ్లీ పెడుతున్నారు. రైతులు ఇందుకు అంగీకరిస్తారా? ధాన్యం కొన్నారా? ఆ డబ్బులు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు.
తెలుగుతమ్ముళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండాలన్నారు. క్విట్ జగన్… సేవ్ ఏపీ!… అని మహానాడులో పిలుపునిచ్చారు చంద్రబాబు. రేపో ఎల్లుండో శ్రీలంక దారిలో ఆంధ్రప్రదేశ్ పోతుందన్నారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితులను చూస్తూ ఊరుకోవద్దంటున్నారు చంద్రబాబు. ఈ సమస్యకు పరిష్కారం… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే. మేం ప్రజలకోసం పోరాడుతుంటే… వైసీపీ నేతలు మాపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా భయపడేది లేదు. బుల్లెట్‌లా దూసుకెళతాం తప్ప, వెనక్కి తిరగం. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి చూద్దాం. ఎంత ఇబ్బంది పెడితే అంత రాటుతేలిపోయాం అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అంతేకాదు తెలంగాణ సీఎం తరహాలో చంద్రబాబు కూడా చేతికి దట్టీ కట్టారు. దీనిని సెంటిమెంట్ కి చిహ్నంగా భావిస్తారు. మరి చంద్రబాబు కూడా ఈ దట్టీ అస్త్రం ప్రయోగించారన్నమాట.
వైసీపీ సామాజిక న్యాయంపై తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు చంద్రబాబు. ఇదేనా సామాజిక న్యాయం?సామాజిక న్యాయం అంటూ కబుర్లు చెబుతున్నారు. కానీ, రాజ్యసభ సభ్యత్వాలు చూస్తే… ఇద్దరు తెలంగాణ వాళ్లకు ఇచ్చారు. జగన్ ని కోర్టుల్లో రక్షించేవారికి ఒకటి, లాబీయింగ్ చేసే వాళ్లకు ఒకటి ఇచ్చారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… ఇదేనా మీ సామాజిక న్యాయం.
వైసీపీ నేతలు కూడా తమదైన రీతిలో టీడీపీ అధినేతను టార్గెట్ చేశారు. సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర ద్వారా ఒకరు కాదు ఇద్దరు కాదు 15 మందికి పైగా మంత్రులు ఒకే వేదికగా సమర శంఖం పూరిస్తున్నారు. ప్రతి వేదికమీద టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి రోజా అయితే బాలయ్యను టార్గెట్ చేశారు. బావని వదిలి బయటకు రండి అంటూ హితోపదేశం చేశారు. మహానాడుని మహా స్మశానం అంటూ కామెంట్లు చేశారు. సాధారణంగా ముందస్తు ఎన్నికలంటే సాధారణంగా వాస్తవ షెడ్యూల్ కంటే అయిదారు నెలల ముందు వస్తాయి. కానీ జగన్ మాత్రం అంతకంటే ముందు.. ముందస్తుకు ముహూర్తం పెట్టినట్టే భావిస్తున్నారు. వచ్చే ఏడాది మే నెలలోనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దానికి నాంది సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ ఏకాకి గానే బరిలోకి దిగడం ఖాయం. పైగా సింహం ఒక్కటిగానే వస్తుంది.. పులి పులే..వంటి డప్పాలు ఎన్ని కొట్టుకుంటున్నా వైసీపీతో చేతులు కలిపేందుకు ఇతర పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. గతంలోలాగే సింగిల్ గా వచ్చి ప్రభంజనం సృష్టిస్తామంటున్నారు. మాట్లాడితే వైసీపీ వ్యతిరేక ఓటు గురించి పవన్ ప్రప్తావిస్తున్నారు. ఆ ఓటు చీలకుండా చేయాలని భావిస్తున్నా ఎలాగోలా తన వ్యతిరేక ఓట్లు విపక్షాలకు పడకుండా చేయాలని జగన్ భావిస్తున్నారు. జగన్ తనకి వ్యతిరేకంగా చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్న పార్టీలను కలవకుండా చెయ్యడం..అది తన చేతుల్లో లేదు. తన వ్యతిరేక శక్తులు ఒకటై ఎన్నికలకు సిద్ధపడే సమయం కూడా ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనేది వ్యూహం. సామాజికభేరితో తన ఆలోచన అమల్లో పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మంత్రుల్ని ముందుగా క్షేత్రస్థాయికి పంపి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. మంత్రుల్ని రంగంలోకి దింపి యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Petrol Price: వాహనదారులకు కాస్త ఊరట.. స్థిరంగా పెట్రోల్!