Site icon NTV Telugu

YSRCP: జగన్‌కు మిథున్‌రెడ్డి సోదరుడి లాంటి వారు.. కొమ్మలు నరికితే చెట్టు బలహీనపడుతుందనే అరెస్ట్..!

Nisar Ahmed

Nisar Ahmed

YSRCP: మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు.. ఎప్పుడూ నేనున్నానంటూ.. వెంటే ఉంటారని.. ఆ కక్ష తోనే కూటమి ప్రభుత్వం మిథున్‌ రెడ్డిని అరెస్ట్ చేసింది.. కొమ్మలను నరికిస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్‌ నిస్సార్ అహ్మద్. ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మదనపల్లి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు మేకా శేషుబాబు, మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్‌ షేక్ నజీర్ హమీద్ ములాఖాత్ లో కలిశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ.. కొమ్మలను నరికేస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబమని, వారికంటే ప్రజలకు మీరు సేవ చేసి చూపించండి అని సవాల్‌ చేశారు.

Read Also: Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?

ఇక, ఏపీ మద్యం కేసును.. ఢిల్లీ లిక్కర్ కేసుతో పోలుస్తున్నారు.. మద్యం పాలసీ గత ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైందన్నారు నిస్సార్ అహ్మద్.. గతంలో ప్రభుత్వ ఆదాయం భారీగా వచ్చింది… ప్రస్తుత కూటమి హయాంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నుంచి విడగొట్టడానికే మిథున్‌ రెడ్డిని జైలుకు పంపారని, మిథున్ రెడ్డి పై పెట్టిన కేసులు నిరూపితం కావు… కడిగిన ముత్యంలా ఆయన బయటికి వస్తారని.. దమ్ముంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయండి.. తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు అంటూ హితవు పలికారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్‌ నిస్సార్ అహ్మద్.

మరోవైపు, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మనోధైర్యం దెబ్బతీయటానికే ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని మండిపడ్డారు.. అనంతపురం జిల్లాలోని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నరేష్ కుమార్‌ రెడ్డి.

Exit mobile version