NTV Telugu Site icon

Dung Cakes Fight : ఘనంగా జరిగిన పిడకల సమరం.. పలువురికి గాయాలు

Pidakala Samaram

Pidakala Samaram

ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం ఆనవాయితీగా వస్తోంది. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిని ఒక్కటి చేసేందుకు రెండు వర్గాలు పిడకలతో హోరాహోరీగా పోరాడి, పిడకల సమరం అనంతరం పంచాయతీ జరిపి స్వామి అమ్మవార్లను ఒక్కటి చేయడం జరుగుతుంది. సుధీర్ఘ చరిత్ర ఉన్న ఈ పిడకల యుద్ధాన్ని ప్రతి ఏటా ఉగాది మురుసటి రోజు దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కైరుప్పలలో పిడకల సమరం ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. పెద్దరెడ్డి వంశస్థుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీమార్బలం, తప్పెట్లు మేళతాళాలతో సాంప్రదాయ ప్రకారం కారుమంచి గ్రామం నుంచి కైరుప్పల గ్రామానికి ఆదివారం సాయంత్రం వచ్చారు.

వీరభద్రస్వామి, కాళికాదేవి ఆలయంలో పూజలు చేసి వెనుదిరగగానే పిడకల సమరం ప్రారంభమైంది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకున్నారు. ఒకసారి ఒక వర్గం వారి పైచేయి కాగా.. మరోసారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. అర గంటకుపైగా సాగిన సమరంలో వీరభద్రస్వామి వర్గం విజయం సాధించింది. అయితే పిడకల సమరం ముగిసాక, స్వామి వారి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అయితే పిడకల సమరాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ పిడకల యుద్ధంలో 50 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

TATA NEU : తగ్గేదేలే అంటున్న టాటా గ్రూప్స్.. 7న యాప్‌ లాంచ్..