DSP Sunil Kumar Used A Car Which Is Booked In Marijuana Case: అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. గంజాయి కేసులో పట్టుబడిన వాహనంలో.. తన కుటుంబ సభ్యులతో కలిసి షికారుకి వెళ్లారు. మరో విడ్డూరం ఏమిటంటే.. అదే కేసులో పట్టుబడిన మరో కారు నంబర్ ప్లేటుని తీసి, దానికి అమర్చారు. విశాఖ బీచ్ వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో.. ఈ బండారం మొత్తం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సీజ్ చేసిన కారుని డీఎస్పీ సొంతానికి వాడుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Suriya 42: సిక్స్ ప్యాక్ లో సూర్య… ఒక చిన్న వీడియోతో ట్విట్టర్ షేక్
గంజాయి కారు చరిత్ర:
గతేడాది జులైలో అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో కొందరు దుండగులు కారులో గంజాయి తరలిస్తున్నారు. పోలీసులు తారసపడగా.. వాళ్లు ఆ కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు ఆ కారును సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ కారు ఎవరి పేరు మీద ఉందన్న విషయంపై ఆరా తీయగా.. జి.మాడుగులకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో రిజిస్టరై ఉన్నట్లు తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా.. రాజస్థాన్‌కు చెందిన సింగ్ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు గతేడాది నవంబర్ 11న పోలీస్ స్టేషన్‌కి రాగా.. విచారించి, అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తాను వేసుకొచ్చిన కారుని తన తల్లికి అప్పగించాలని అతడు కోరాడు. అయితే.. ఆమె రాజస్థాన్ వెళ్లిపోయారని తెలియడంతో, ఆ కారుని అనకాపల్లి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అప్పటినుంచి పోలీసులు దాన్ని వాడుకుంటున్నారు.
Karimnagar Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన టాటా ఏస్
ఈ క్రమంలోనే ఈనెల 1వ తేదీన డీఎస్పీల్ సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారులో విశాఖపట్నం వెళ్లారు. బీచ్ రోడ్డులో ఆయన ఒక వాహనాన్ని ఢీకొట్టగా.. అక్కడున్న వారు ఆ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ కారు బండారం బట్టబయలైంది. ఈ వ్యవహారంపై ఎస్పీ గౌతమి మాట్లాడుతూ.. ‘డీఎస్పీ సునీల్ గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుడి కారులో ప్రయాణించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే.. నంబరు ప్లేట్ మార్చడం మరో నేరమని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని, పూర్తి నివేదికను వారికి పంపుతామని తెలిపారు. మరోవైపు.. ఆ కారుని నంబర్ ప్లేట్ మార్చిన విషయం తనకు తెలియదని డీఎస్పీ సునీల్ పేర్కొన్నారు. తాను ఆసుపత్రికి వెళ్లాలంటే, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ కారుని పంపారన్నారు.