DL Ravindra Reddy: కడప జిల్లా వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని డీఎల్ రవీంద్రారెడ్డి ఆకాంక్షించారు. అయితే తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని, కానీ వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి మైదుకూరులో పోటీ చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
1978 నుంచి డీఎల్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1978లో మైదుకూరు నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. కానీ గత ఎన్నికల ముందు టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. కానీ చంద్రబాబు సీటు ఫిక్స్ చేయలేదు. దీంతో డీఎల్ వైసీపీలో చేరి మైదుకూరులో వైసీపీ గెలుపు కోసం పనిచేశారు. ప్రస్తుతం డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబును పొగడటం బట్టి చూస్తే ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
Read Also: Free Smart Phone: బంపర్ ఆఫర్.. కామెంట్ చేయండి.. ఉచితంగా స్మార్ట్ ఫోన్ పొందండి..!!
అయితే డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎల్ వెన్నుపోటు నేత అని.. వెన్నుపోటు పొడిచే డీఎల్‌ను ఎవరూ నమ్మే పరిస్థితులు లేవని కౌంటర్ ఇచ్చారు. డీఎల్ ఏ పార్టీలో చేరినా వెన్నుపోటు పొడుస్తాడని.. ఆయన్ను టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ఏ పార్టీ కూడా ఆయన్ను చేర్చుకునే సాహసం చేయవని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు. జగన్ పుట్టినరోజు నాడే జగన్‌పై ఆరోపణలు చేయడానికి డీఎల్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు.