మహానాడు ముగిసినప్పటి నుంచీ కొనసాగుతూ వస్తోన్న నటి దివ్యవాణి రాజీనామా వ్యవహారానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఆమె తన తుది నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం.. తాను తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు దివ్యవాణి స్పష్టం చేశారు. నిజానికి.. దివ్యవాణి రాజీనామా వ్యవహారం సినిమాటిక్‌గా సాగిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.
మహానాడు ముగిసిన వెంటనే దివ్యవాణి ట్విటర్ మాధ్యమంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, మహానాడులో తనకు జరిగిన అవమానం తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహానాడులో తనకు మాట్లాడనివ్వలేదని, కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తన పిల్లలు సైతం తనని తిట్టిపోశారని, మర్యాద లేని చోట ఎందుకుంటావని చెప్పారని, ఈ నేపథ్యంలోనే పార్టీకి వీడ్కోలు పలుకుతున్నానని చెప్పారు. అయితే, కాసేపట్లోనే దివ్యవాణి ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. తన ట్వీట్ డిలీట్ చేసేశారు.
అనంతరం చంద్రబాబుని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ భేటీ తర్వాత దివ్యవాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. దానికి తెరదించుతూ.. చంద్రబాబుతో సమావేశమైన వెంటనే తన రాజీనామాని ఆమె ప్రకటించారు. టీడీపీలో మర్యాదలకు తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
