NTV Telugu Site icon

Andhra Pradesh: త్వరలోనే ఆధార్ కార్డులో జిల్లా పేర్ల మార్పు

Aadhar Card

Aadhar Card

ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులను అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో పాత జిల్లా పేర్ల స్థానంలో కొత్త జిల్లా పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో చర్చిస్తున్నామని ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు వివరించారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుపై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.

మండలం, పిన్‌కోడ్ మ్యాపింగ్ చేసి వాటి ఆధారంగా మార్పులు చేస్తే ఆధార్‌లోనూ జిల్లా పేర్లు వాటంతట అవే మారేలా చేయవచ్చని సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి సరిదిద్దవచ్చని తెలిపారు. అయితే ఇది ప్రతిపాదన మాత్రమే అని.. ఇంకా ఆమోదించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆధార్‌లో పాత చిరునామా ఉంటుందని.. ప్రింట్ తీసుకున్నా దాని ప్రకారమే వస్తుందని వివరించారు. తెలంగాణలోనూ కొత్త జిల్లాలు అమల్లో ఉన్నాయని.. అక్కడ కూడా ఇదే సమస్య ఉందని సీసీఎల్‌ఏ కార్యదర్శి గుర్తుచేశారు.

YSRCP: కానిస్టేబుల్ తీరుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం