NTV Telugu Site icon

Sangam Dairy: జీడీసీసీ అక్రమాలపై కలెక్టర్ కు ధూళిపాళ్ళ ఫిర్యాదు

Narendra

Narendra

జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో సమావేశం అయ్యారు. జీడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను నివేదించారు. వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అక్రమాల్లో బ్యాంకుతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందన్నారు.

రూ.కోట్లలో బ్యాంకు సొమ్ము స్వాహా అయిందని, ఈ వ్యవహారంపై సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలన్నారు. వైసీపీ ముఖ్యనేత బంధువైన కారుమూరి అశోక్‌రెడ్డి, మాచవరం తహసీల్దార్‌ హన్మంతరావు పలు అక్రమాల్లో ముఖ్యపాత్ర ఉందని ధూళిపాళ్ళ ఆరోపించారు. వీరిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని బ్యాంకు బ్రాంచీలు, సంఘాలలో మాత్రమే బోగస్‌ రుణాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలా కాకుండా 167 సంఘాలన్నింటిని విచారణ జరిపితే అసలు ఎంత సొమ్ము దుర్వినియోగమైంది, దోషులు ఎవరు అనే విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

బ్యాంకుకు చెందిన 42 బ్రాంచీలలోనూ తనిఖీలు నిర్వహించాలన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు వైసీపీ వచ్చిన తర్వాత దాని ప్రతిష్ట స్కామ్‌ల ద్వారా మసకబారుతోండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. డ్వాక్రా గ్రూపులకు ఈ రెండేళ్లలో ఇచ్చిన రూ.850 కోట్ల రుణాల్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. బినామీ గ్రూపుల పేరుతో రూ.లక్షలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. ఈ వ్యవహారాలపై నిష్పాక్షికంగా దర్యాప్తు సాగించాలన్నారు.

Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..

Show comments