Site icon NTV Telugu

Devineni Uma: సీఐడీ నా వెంట పడుతోంది.. నా మీద ప్రేమ పుట్టిందా?

Devineni Uma

Devineni Uma

ఏపీ సీఐడీ నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు వరుస ఫోన్‌లు వెళ్తున్నాయి. ఫేక్ ట్వీట్ విషయంపై మంత్రి అంబటి రాంబాబుపై చేసిన ఫిర్యాదు అంశంలో ఉమ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకునేందుకు సీఐడీ ఫోన్‌లు చేస్తోంది. అయితే రెండు రోజులుగా సీఐడీ తనకు వరుసగా ఫోన్‌లు చేస్తుండటంపై దేవినేని ఉమ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడైన మంత్రి అంబటి రాంబాబును కాకుండా.. తన వెంట పడటమేంటని ఫోన్‌లోనే దేవినేని ఉమ సీఐడీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సీఎం జగన్‌ను, సజ్జలను విమర్శిస్తున్నానని సీఐడీ చీఫ్‌కు తనపై ప్రేమ పుట్టిందా అంటూ సీఐడీ పోలీసులను ప్రశ్నించారు.

Read Also: Chandra Babu: దళిత యువకుడు నారాయణ మృతిపై న్యాయవిచారణ జరిపించాలి

దోషులను పట్టుకోకుండా సీఐడీ చీఫ్‌కు తనపై కోపమెందుకు వచ్చిందంటూ దేవినేని ఉమ మండిపడ్డారు. సజ్జలను ప్రశ్నించినందుకా లేదా లండన్ మందుల గురించి లేవనెత్తినందుకా అంటూ మండిపడ్డారు. తాను ఫిర్యాదు చేస్తే.. ఇంకా స్టేట్‌మెంట్ ఏంటంటూ ఆగ్రహించారు. దొంగను పట్టుకోకుండా తన వెంట పడతారేంటంటూ అంబటిని ఉద్దేశిస్తూ సీఐడీ పోలీసులను దేవినేని ఉమ ప్రశ్నించారు. తానేం భయపడనని రాజమండ్రి వెళ్లేందుకు తాను ప్రిపేర్ అవుతున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఐడీ తన ఫిర్యాదుపై స్పందించి అంబటిని అరెస్ట్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. త‌న ఫిర్యాదు ఆధారంగా ముందుగా మంత్రి అంబ‌టి రాంబాబును విచారించి అరెస్ట్ చేయాల‌ని, ఆ త‌ర్వాత త‌న వాంగ్మూలం అవ‌స‌ర‌మైతే.. చ‌ట్ట ప్ర‌కారం నోటీసులు ఇస్తే విచార‌ణ‌కు రావ‌డానికి త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌ని ఆయ‌న అన్నారు.

Exit mobile version