మరోసారి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పాపం జగనుదేనని, పోలవరం విషయంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 2021 జూన్ కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పేశారని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదని, పోలవరానికి సంబంధించి కేంద్రం నిధులేమయ్యాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తి వెదిరె శ్రీరాంకు పోలవరం బాధ్యతలు అప్పజెప్పి.. ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి చేతులు కట్టుకుని కూర్చొంటున్నారని, పోలవరం డ్యామును.. పోలవరం బ్యారేజీగా మార్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
గోదావరి మీద పులిచింతల ప్రాజెక్టు కట్టారన్న ప్రబుద్దుడు మంత్రి అంబటి నన్ను విమర్శిస్తారా..? అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో 28 మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారు.. ఎందుకు గడ్డి పీకడానికా..? అంటూ ఆయన మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించుకోవడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారని, కేసీఆర్ స్టేట్‌మెంటును ఇప్పటికీ సీఎం జగన్ కానీ.. మంత్రులు కానీ ఎందుకు ఖండించ లేదని ఆయన అన్నారు.
కేసీఆర్ నుంచి ఎన్నికల నిధులు తెచ్చుకున్నారు కాబట్టే సైలెంటుగా ఉంటున్నారని, పోలవరం నిర్వాసితులకు చెందాల్సిన నిధులను పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అనంతబాబు పందికొక్కుల్లా తిన్నారని ఆయన ధ్వజమెత్తారు. దేవిపట్నం తహసీల్దార్ ఎందుకు సస్పెండ్ అయ్యారో చెప్పగలరా..? నిర్వాసితుల నిధులను బొక్కేసిన విషయమై సీఎం జగన్, మంత్రి అంబటి ఎందుకు మాట్లాడరు..? అని ఆయన ఉద్ఘాటించారు. పోలవరం నిర్వాసితుల నిధుల్లో జరిగిన అవకతవతలపై చర్చకు సిద్దం అంటూ ఆయన సవాల్ విసిరారు.