NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలిస్తున్న పవన్‌ కల్యాణ్..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఉప ముఖ్యమంత్రి తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను కొంత మంది ప్రజలు పవన్‌ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నారు.

Read Also: AP-TET 2024: ఆగస్టు 3న ముగియనున్న ఏపీ టెట్ దరఖాస్తు గడువు

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్య డిప్యూటీ సీఎం పవన్‌ను కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్‌పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని… వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదే విధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకుల వివరాలు, బైక్స్‌పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్సైను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలి అన్నారు. ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ తెలిపారు.