Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్య్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, రేపు (బుధవారం) నామినేషన్లను ఎన్నికల కమిషన్ పరిశీలించనుంది. ఆగష్టు 30వ తేదీన తుది ఎన్నికలు జరుగనున్నాయి.
Read Also: AP High Court: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత
అయితే, మరోవైపు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావించినప్పటికి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ బరిలో నిలవగా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి బై ఎలక్షన్ జరుగబోతుంది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉండగా.. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ దక్కనుంది. పోటీకి దూరంగా ఉండాలన్న ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనం కానుంది.