Site icon NTV Telugu

ఏపీకి గుడ్‌న్యూస్.. పూర్తిగా తప్పిన తుపాన్‌ ముప్పు..!

ఆంధ్రప్రదేశ్‌కు…జొవాద్ తుపాను ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరానికి దగ్గర వచ్చినట్లే వచ్చి…దిశ మార్చుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. జొవాద్ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయ్. మరోవైపు తుపాను ప్రభావంతో…దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్‌ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశ మార్చుకుందని వివరించింది.

తుపాను ప్రస్తుతం మందగమనంతో ఒడిశా వైపు కదులుతోందని వెల్లడించింది. గడచిన 6గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు చెప్పింది.కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇదే వేగంతో కదులుతూ…ఇవాళ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. తదుపరి మరింత బలహీనపడి పశ్చిమ్‌ బెంగాల్‌ వైపుగా కదిలే సూచనలు ఉన్నాయ్. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

జొవాద్ తుపాను ప్రభావంతో…ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయ్. జవాద్‌ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, పలాస -విశాఖపట్నం, కిరండోల్‌- విశాఖపట్నం, తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ -తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది.

Exit mobile version