NTV Telugu Site icon

Cyclone: వాయువేగంతో రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆసాని’ తుపాన్!

Cyclone

Cyclone

ఆంధ్ర రాష్ట్రానికి మ‌రో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

ఇది వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది. ఆ తరువాత ఈరోజు సాయంత్రానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆసాని తుఫాను తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుఫాను ధాటికి ఏపీ, బెంగాల్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తుఫాను నేపథ్యంలో అండమాన్ సహా.. ఒడిశా, బెంగాల్, సిక్కిం, అస్సాం, ఏపీ, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

అయితే .. తుఫాన్‌ హెచ్చరికతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర, మధ్య ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుఫాన్‌ ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. దాంతో విపత్తు నిర్వహణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసాని తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తుపాన్ కి ‘ఆసాని’ అని నామకరణం

బంగాళఖాతంలో ఏర్పడే తుపాన్ లకు ఆచుట్టూ ఉండే దేశాలు వంతుల వారీగా తుపాన్లకు నామకరణం చేస్తాయి. ఈసారి రాబోయే తుపాన్ కు పేరు పెట్టే అవకాశం శ్రీలంక కు వచ్చింది. రాబోయే తుపాను కు ఆసాని అనే పేరును శ్రీలంక ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సింహళ భాషలో ఆసాని అంటే కోపం, ఆగ్రహం అని అర్ధం అంట. అయితే ఈ ఆసాని ఆగ్ర‌హానికి ఎన్ని విప‌త్క‌ర ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి వ‌స్తుందోన‌ని ప్ర‌జ‌లు భ‌యభ్రాంతుల‌కు గుర‌వుతున్నారు.విశాఖకు 1000కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి వుంది ఆసాని తుపాన్. సాయంత్రానికి తీవ్ర తుఫాన్ గా మారనుంది ఆసాని.

Tirupati Ruia Hospital: రుయా సిబ్బంది తీరుపై విమర్శలు