Site icon NTV Telugu

CPI Narayana : బీజేపీ-వైసీపీ బంధం చాలా అన్యోన్యంగా ఉంది

Cpi Narayana

Cpi Narayana

బీజేపీ, వైసీపీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ-వైసీపీ బంధం చాలా అన్యోన్యంగా ఉందని, తల వంచి.. మెడ వంచి.. జగన్ మోడీ జపం చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హోదా, పోలవరం నిధులు ఏమయ్యాయి..? ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కదా..? అని ప్రశ్నించారు. మోడీకి భయపడి, గజగజ వణుకుతూ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారని, రక్తసిక్త హస్తాలతో రాష్ట్రాలను నాశనం చేస్తోన్న మోడీ, అమిత్ షాలను చూసి వణికిపోతున్నారన్నారు. నేటి వరకు మోడీ 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు, ఇంకో 100 అమ్మకానికి సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. గుజరాత్ వాళ్ళకే అన్ని అమ్ముతున్నారని, డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు గుజరాత్ వాళ్లే అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఎదురు తిరిగినా.. జగన్ మాత్రం ఏమి మాట్లాడరు. తీర ప్రాంతం అంతా గుజరాత్ వాళ్ళకే రాసిస్తున్నారు. బొగ్గు కొనుగోలుపై కేసీఆర్ ఎదురు తిరిగారు.. ఆదాని దగ్గర కొననని చెప్పారు.

బీజేపీ వ్యతిరేక శక్తులన్ని కలిసి పోరాడాలి. జులై 13 నుంచి 17 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నా పైన హనుమాన్ చౌదరి క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడతామన్నారు.. దాన్ని స్వాగతిస్తున్నా. మోడీపై నేను చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ అనుకునేవే దానిపై చర్చకు సిద్ధం. అల్లూరి సీతారామరాజు జయంతి రోజు ప్రధాని గిరిజనులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. నేటికి గిరిజనులపై కార్పొరేట్ సంస్థలు అడవుల్ని ఆక్రమించుకోవాలని దాడులు చేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది గిరిజనులు రాష్ట్రంలో అడవుల్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నారు. సహజ వనరుల కోసం అడవుల్ని కార్పొరేట్ సంస్థలు నాశనం చేయాలని చూస్తున్నారు. గుజరాత్ అల్లర్ల గురించి ప్రపంచానికి తెలుసు, సుప్రీం కోర్టు ఆ కేస్ కొట్టేస్తూ న్యాయమూర్తి పరిధి దాటి వ్యాఖ్యలు చేశారు.

న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆధారం చేసుకుని అమిత్ షా పిటిషనరుని అరెస్ట్ చేయమని చెప్పడం దారుణం. పిటిషనరుపై అలాంటి వ్యాఖ్యలు చేయడం పౌర హక్కులను కాలరాయడమే. అక్కడ అలా చేస్తూ ఇక్కడికి వచ్చి గిరిజనులపై ప్రేమ ఒలకబోయడం ఖచ్చితంగా రాజకీయ లబ్ది కోసమే. దేశం ఉన్నది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకు ఉన్నాయి. మహారాష్ట్ర సహా 9 రాష్ట్రాల్లో బీజేపీ ఓడినా ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతీస్తూ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఫెడరల్ వ్యవస్థను మోడీ దెబ్బ తీస్తున్నారు,.ఇప్పుడు బీజేపీ కన్ను ఢిల్లీ, తెలంగాణపై పడింది అని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version