తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది.. ఉద్యోగాల కోసం, బతుకుదెరువు కోసం కన్నఊరిని విడిచి ఇతర పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలకు తరలివెళ్లినవారు అంతా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.. ఇదే సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి రవాణా సంస్థలు.. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతోన్న ఏపీఎస్‌ఆర్టీసీ కూడా.. 50 శాతం అదనపు వడ్డింపు తప్పదని స్పష్టం చేసింది.. అయితే, దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. అసలే ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఉంటే.. ఈ అదనపు వడ్డింపులు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు..
Read Also: వరంగల్ నిట్‌లో కరోనా కలకలం.. సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు
బస్సు చార్జీలపై స్పందించిన సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సుల్లో ఏపీఎస్‌ఆర్టీసీ 50 శాతం అదనంగా ఛార్జీలు పెంచడం సరైందికాదన్నారు.. ఇక, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు హైదరాబాద్-విజయవాడకు రూ.3 వేలు, హైదరాబాద్-విశాఖకు రూ.5 వేలు చార్జీలను వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డ ఆయన.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల్లో చార్జీలను పెంచలేదు… తెలంగాణ తరహాలో ఏపీఎస్‌ఆర్టీసీలో కూడా సాధారణ చార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.. ఇదే సమయంలో.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల దోపిడీని నియంత్రించాలని ప్రభుత్వానికి సూచించారు రామకృష్ణ.