NTV Telugu Site icon

Vizag Steel Plant: బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్‌ పాల్గొంటే స్వాగతిస్తాం..!

Cpi Narayana

Cpi Narayana

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బిడ్డింగ్‌ విషయంలో ఇప్పుడు తెలంగాణ సర్కార్ వర్సెస్‌ ఏపీ ప్రభుత్వంగా మారిపోతోంది.. అసలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్‌, వ్యతిరేకమా? అనుకూలమా? అనే విషయం స్పష్టం చేయాలి.. బిడ్‌లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అని ఏపీ మంత్రి గుడివాడ్‌ అమర్నాథ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.. కానీ, కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యక్తులుగా తీసుకుంటే మాత్రం మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం తీసుకుంటే పబ్లిక్ సెక్టార్‌గా మారుతుందన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ కొంటే నష్టం ఉండదు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 30 వేల ఎకరాల భూమి ఉందని గుర్తుచేశారు.

Read Also: Vizag Steel Plant: ఆ విషయం బీఆర్ఎస్‌ స్పష్టం చేయాలి.. లేదంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే..!

విశాఖ స్టీల్ ప్లాంట్ దొంగ చేతికి ఇచ్చిన 3 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని వ్యాఖ్యానించారు సీపీఐ నేత నారాయణ.. అదానీ ఎందుకు వస్తున్నారు..? విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకోవడానికి కారణం దానిని స్క్రాప్ కింద అమ్మేయడానికేనని ఆరోపించారు. స్వాధీనం చేసుకొని డంపింగ్ యార్డ్ కింద అదానీ మార్చుకుంటారని విమర్శించారు. ఎయిర్‌పోర్ట్‌, పోర్టులకు దగ్గరగా 30 వేల ఎకరాలు ఎక్కడా దొరకదన్నారు.. ఇక, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి బానిసగా మారిపోయారని ఆరోపించారు. అదానీకి అనుకూలంగా ఉండకపోతే వైఎస్‌ జగన్‌ను జైల్లో పెడతారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. అదానీకి అనుకూలంగా లేకపోతే అమిత్ షా ఊరుకోడు.. అందుకే.. ఆస్తి పోయినా పర్వాలేదు.. నన్ను కపాడు అంటారని పేర్కొన్నారు. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుంటా అని జగన్ అంటే మరుసటి రోజు జైల్లో ఉంటాడు అంటూ సంచలన కామెంట్లు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.