NTV Telugu Site icon

GSLV Mk3: జీఎస్ఎల్వీ మార్క్3 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్‌

Isro

Isro

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి రెడీ అయ్యింది.. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది… ఈ అర్ధరాత్రి (శనివారం) 12.07 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ కొనసాగుతుండగా.. 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత.. అంటే ఇవాళ అర్ధరాత్రి 12.07 గంటలకు (23.10.2022)న (ఆదివారం) అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.. ఇక, ఈ ప్రయోగం ద్వారా 5,200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది రాకెట్.. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వెంటనే యూకేకు చెందిన గ్రౌండ్ సిబ్బంది వాటిని తమ అధీనంలోకి తీసుకోనున్నారు..

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఎన్ఎస్ఐఎల్‌తో ఒప్పందం తర్వాత నిర్మాణం అయిన తొలి బరువైన రాకెట్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్ ను రూపొందించారు. ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉందంటున్నారు.. 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ బెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఇటీవల ఒక ఒప్పందం కుదిరింది.. నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదు. భారతదేశం నుండి నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ మార్క్–3లో ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. మరోవైపు చంద్రయాన్ -3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్ లో ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.