NTV Telugu Site icon

టీటీడీ అగర్‌బత్తీల తయారీపై వివాదం

తిరుమల తిరుపతి దేవస్థానం అగర్‌బత్తీలు తయారుచేయడంపై ఏపీ సాధుపరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు ధార్మిక సంస్థా? లేక వ్యాపార సంస్థా? అని ఏపీ సాధుపరిషత్ ప్రశ్నించింది. శ్రీవారి పూజ అనంతరం నిర్మల్యాలను అగర్‌బత్తీలా మారుస్తామంటే అర్థం ఏంటని మండిపడింది. స్వామి వారి పూజకు వినియోగించిన పూలు పర్యావరణానికి హాని ఎలా అవుతాయో టీటీడీ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది. హిందూ వ్యతిరేక చర్యలను టీటీడీ ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికింది. స్వామివారికి అలంకారం చేసిన పూలు పవిత్రమైనవేనని, కానీ ఒక్కసారి వాడిన పూలను పవిత్ర జలాల్లో కలిపేయడం కానీ, వాటిని భూమిలో కప్పివేయడం కానీ చేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వివరించారు. టీటీడీ శాస్త్రవిరుద్ధ చర్యలకు పాల్పడితే తాము నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. 

Read Also: టాలీవుడ్‌ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు

కాగా శ్రీవారికి వినియోగించే పూల వ్యర్థాల నుంచి సుగంధ భరితమైన అగర్ బత్తీలను టీటీడీ తయారు చేస్తోంది. మొత్తం 7 రకాల అగర్ బత్తీలను టీటీడీ ఉత్పత్తి చేస్తోంది. తయారుచేసిన అగర్ బత్తీలను తిరుమల కొండపై ఉన్న లడ్డూ కౌంటర్లు, గోశాల, కొబ్బరికాయల కౌంటర్ లోనూ, తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం వద్ద, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ విక్రయిస్తోంది.