Site icon NTV Telugu

Andhra Pradesh: టీడీపీ నేతను ఆరునెలల పాటు బహిష్కరించిన కలెక్టర్

Telugu Desam Party

Telugu Desam Party

Andhra Pradesh: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డికి జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. ఆయన్ను జిల్లా నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ కలెక్టర్ గిరీష ఆదేశాలు జారీ చేశారు. కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కొండ్రెడ్డిని తరచూ గొడవలకు దిగే నేరస్థుడిగా గుర్తించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం-1980 ప్రకారం సెక్షన్ 2(1) కింద కొండ్రెడ్డిని గూండాగా పరిగణించవచ్చని పేర్కొన్నారు.

Read Also: Chiru: వాల్తేరు వీరయ్య నోట వీర సింహుడి మాట…

తాజా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొండ్రెడ్డి బెయిలుపై కడప జైలు నుంచి బయటకు రాగానే కలెక్టర్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అందిన తేదీ నుంచి ఆరు నెలలపాటు టీడీపీ నేత కొండ్రెడ్డి అన్నమయ్య జిల్లాను వదిలి వెళ్లాలని ఆదేశించారు. అలాగే ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. దీంతో జైలు నుంచి బయటకు రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ఇటీవల కురబటకోటలో వైసీపీ దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన కొండ్రెడ్డిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని.. ఈ ఘటనలో పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం సరికాదని మండిపడుతున్నాయి.

Exit mobile version