మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నేత గౌతమ్ రెడ్డి అని జగన్ అన్నారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రానున్నారు. స్వయంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జగన్ నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే వైఎస్ విజయమ్మ, షర్మిల అపోలో ఆస్పత్రికి చేరుకుని మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబీకులను పరామర్శించారు.
మరోవైపు గౌతమ్‌రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ‘గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు. చేసే పని పట్ల నిబద్ధత కల్గిన నాయకులు’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. అటు ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మరణం కలచివేసిందని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తికి గుండెపోటు రావడం బాధాకరమని మాజీ మంత్రి లోకేష్ అన్నారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం ప్రకటించారు. ‘గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
